నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కోర్టు డ్యూటీ అధికారుల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కోర్టు డ్యూటీ అధికారుల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 5: నేరస్తులకు శిక్ష పడేలా చేయడంలో కోర్టు డ్యూటీ అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కోర్టు డ్యూటీ అధికారులకు కేసులపై పూర్తి అవగాహన కల్పించడం స్టేషన్ హౌస్ ఆఫీసర్ల బాధ్యత అని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి కేసును సమగ్రంగా పర్యవేక్షించాలని సూచించారు. కేసుల విచారణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
సమ్మన్లు, వారెంట్ల జారీ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో సాక్షులు, నిందితులకు అందజేయాలని సూచించారు. కోర్టులో విచారణ సమయంలో సాక్షులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, వారికి కేసు వివరాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. దీంతో కేసుల విచారణ వేగవంతమై న్యాయ ప్రక్రియ సమర్థవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా, కేసులకు సంబంధించిన సీజ్ చేసిన ఆస్తులను, వస్తువులను నిర్దిష్ట సమయాల్లో కోర్టులో హాజరు పరచాలని సూచించారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ, నేరస్తులకు శిక్ష పడేలా దర్యాప్తు, విచారణ ప్రక్రియలో కృషి చేయాలని, బాధితులకు న్యాయం చేకూర్చడం ప్రతి పోలీసు అధికారికి ప్రధాన బాధ్యత అని ఎస్పీ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్, కోర్టు డ్యూటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో కేసుల నిర్వహణ, కోర్టు వ్యవహారాల సమన్వయం, న్యాయపరమైన ప్రక్రియలపై పలు సూచనలు, మార్గదర్శకాలు అందించారు.

Post a Comment