సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా వెంటనే ప్రకటించాలి
సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా వెంటనే ప్రకటించాలి
38 శాతం లాభాల వాటా చెల్లించాలి.. టీబీజీకేఎస్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాసరావు డిమాండ్
కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సింగరేణి కాలరీస్‌లో కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాలని, సంస్థ ఆర్జించిన లాభాల్లో కార్మికులకు రావాల్సిన వాటాను వెంటనే ప్రకటించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
కొత్తగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం కార్మికుల కృషి, అంకితభావంతో లాభాలను ఆర్జిస్తోందన్నారు. సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న కార్మికులకు లాభాల్లో 38 శాతం వాటాను వెంటనే ప్రకటించి, చెల్లించే ప్రక్రియను ప్రారంభించాలని కోరారు.
అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన మొత్తం లాభాలు ఎంతన్న విషయాన్ని యాజమాన్యం వెంటనే అధికారికంగా ప్రకటించాలని తుమ్మ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. లాభాల వివరాలను వెల్లడించడంలో జాప్యం చేయడం వల్ల కార్మికుల్లో అనుమానాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. సంస్థ ఆర్థిక పరిస్థితి, లాభాలపై పూర్తి వివరాలను పారదర్శకంగా కార్మికులకు తెలియజేయాలని కోరారు.
సింగరేణి ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడంలో కార్మికులు నిరంతరం కష్టపడుతున్నారని, ఎండా వానా లెక్కచేయకుండా గనుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల శ్రమను యాజమాన్యం గుర్తించాలని ఆయన అన్నారు. సంస్థ లాభాల్లో కార్మికులకు న్యాయమైన వాటా దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
38 శాతం లాభాల వాటాను వెంటనే ప్రకటించడంతో పాటు, ఈ ఏడాది సింగరేణి సాధించిన లాభాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన పునరుద్ఘాటించారు. కార్మికుల హక్కుల కోసం టీబీజీకేఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సభ్యులు వాసికారుల కిరణ్, కంచర్ల శ్రీనివాస్ ప్రసాద్, బ్రాంచ్ కమిటీ సభ్యులు శివ, రవివర్మ, ఫిట్ కమిటీ సెక్రటరీ సూర్యనారాయణ, సూరజ్, జైపాల్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment