ఆర్డర్ అమలు చేయకపోతే కోర్టుకు రండి ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 13: చేప పిల్లల పంపిణీ చేసిన వారికి నగదు చెల్లించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఇంకా అమలు చేయకపోతే కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు హైకోర్టు తేల్చి చెప్పింది.
ఫిబ్రవరిలోనే ఈ కేసులో ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ అమలు జరగలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. “మా ఆదేశాలు అమలు చేస్తారా? లేక కోర్టుకు హాజరవుతారా?” అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
ఆదేశాల అమలుకు చివరిసారిగా నాలుగు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది.
2023–24 సంవత్సరానికి చేప పిల్లల (ఫిష్ సీడ్స్) సరఫరాకు సంబంధించిన నగదు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని ఆరే ఫిషరీస్ ట్రేడర్స్ అండ్ సీడ్ సప్లయర్స్ యజమాని రాజ్‌కుమార్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కాజ శరత్ బుధవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆర్థికశాఖపై కఠినంగా స్పందించింది.

Post a Comment