తెలంగాణలో చలి బీభత్సం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు వణుకుతున్నారు

తెలంగాణలో చలి బీభత్సం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు వణుకుతున్నారు


హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ రాష్ట్రం అంతటా చలి దాపురించింది. గడచిన రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ రావడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండగా, కొమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో బుధవారం రాత్రి కనిష్ఠంగా 10.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతగా వాతావరణ శాఖ వెల్లడించింది.

మరోవైపు, హైదరాబాద్ నగర పరిధిలోని శేరిలింగంపల్లి హెచ్‌సీయూ ప్రాంతంలో 14.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4–5 డిగ్రీల మేర పడిపోయాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుత నెలలో సగటు ఉష్ణోగ్రతలు 13 నుంచి 17 డిగ్రీల మధ్య కొనసాగనున్నాయని అంచనా వేసింది. రాబోయే వారం రోజుల పాటు ఇదే తరహా చలి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం-ఆసిఫాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాచలం, రామగుండం, భూపాలపల్లి, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, పటాన్‌చెరు, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని సూచించారు.

పగటి వేళల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు నమోదవుతున్నప్పటికీ, ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ 16 డిగ్రీల కంటే తక్కువకు పడిపోవచ్చని తెలిపారు.

వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది — రాత్రివేళల్లో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వృద్ధులు, చిన్న పిల్లలు, గుండె, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.