భర్త మృతి… పంచాయతి ఎన్నికల్లో భార్య గెలిచిన కుటుంబం మాత్రం తీవ్ర శోకం
ముత్తారం (మంథని): పెద్దపల్లి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వార్డు మెంబర్ ఎన్నికల్లో భార్య గెలిచినా, కుటుంబం మాత్రం తీవ్ర శోకంలో మునిగిపోయింది.
మచ్చుపేట గ్రామానికి చెందిన పోలుదాసరి శ్రీనివాస్ (38) తన భార్య శ్రీలతను పంచాయతీ ఎన్నికల్లో 4వ వార్డ్ మెంబర్‌గా పోటీ చేయించారు. ఇద్దరూ కలిసి ఇంటింటి తిరిగి ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికల్లో గెలవాలనే ఆశతో ప్రచారం చేసిన దంపతులకు ఇలాంటి దురదృష్టం ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు.
భర్త పురుగులమందు సేవించి మృతి
స్థానికుల సమాచారం ప్రకారం—
ఈనెల 9న శ్రీనివాస్ తెలియని కారణాలతో పురుగుల మందు సేవించడంతో ఆయనను పెద్దపల్లి, అనంతరం కరీంనగర్ ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సలహాపై హైదరాబాదుకు పంపగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం మరణించాడు.
ఓటర్లు గెలిపించారు… కానీ ఇంట్లో విషాదం
భర్త రెండు రోజులుగా జీవన–మరణయాతన పడుతుండగానే గ్రామంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఈ క్రమంలో శ్రీలత వార్డ్ మెంబర్‌గా విజయం సాధించారు. గెలుపు సంబరాలు చేయాల్సిన కుటుంబంలో భర్త మృతితో విషాదం నెలకొంది.
మరణానికి కారణం తెలియరాలేదు
శ్రీనివాస్ ఎందుకు పురుగుల మందు సేవించాడన్న విషయం స్పష్టంగా తెలియరాలేదు.
ఈ ఘటనపై విచారణ గురించి అడగగా ముత్తారం ఎస్సై రవి కుమార్ మాట్లాడుతూ “ఇప్పటివరకు మా వద్ద ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం వచ్చింది” అని తెలిపారు. గ్రామంలో ఒక్కసారిగా నెలకొన్న ఈ విషాదం స్థానికులను దిగ్బ్రాంతికి గురిచేసింది.

Post a Comment