భద్రాచలం ముక్కోటి ఏకాదశి గోడపత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి
భద్రాచలం | 12 డిసెంబర్ 2025: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా డిసెంబర్ 29 మరియు 30 తేదీల్లో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు విచ్చేయనున్న నేపథ్యంలో, భక్తులకు పూర్తిస్థాయి సమాచారం చేరేందుకు గోడపత్రికలను ఆవిష్కరించినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని తన చాంబర్లో గోడపత్రికలను ఆవిష్కరించిన కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ప్రచార పత్రికలను ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో అంటింపు పనులు చేపడుతున్నామని వెల్లడించారు.
అతను మరింతగా మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు వసతి, రవాణా, భద్రతతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాల ఏర్పాట్లపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంగా డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో డివిజనల్ స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు.
ముక్కోటి ఏకాదశి, తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా భక్తులకు కల్పించాల్సిన వసతి సౌకర్యాలపై సంబంధిత అధికారులందరూ పూర్తిస్థాయి నివేదికలతో హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, అర్చక స్వాములు, దేవస్థానం సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు.

Post a Comment