టీపీసీసీ కాంగ్రెస్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నేడు
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు, బిసి రిజర్వేషన్లు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ కమిటీలు, జై బాపు–జై భీం–జై సంవిధాన్ కార్యక్రమాలు, అలాగే ఈ నెల 15న కామారెడ్డిలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది.
ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనుండగా, ఏఐసిసి నాయకురాలు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో పాటు రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరవుతారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని పార్టీ అధిష్ఠానం యోచిస్తోంది. అయితే అన్ని పోస్టులను ఒకేసారి కాకుండా దశలవారీగా భర్తీ చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకేసారి పదవులు రాకపోతే అసంతృప్తి చెందిన నేతలు ఎన్నికలలో పూర్తిస్థాయిలో సహకరించకపోవచ్చన్న ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కామారెడ్డి బహిరంగ సభ
ఈ నెల 15న కామారెడ్డిలో జరిగే బహిరంగ సభను లక్షమంది జనసమ్మేళనంగా విజయవంతం చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. బిసి రిజర్వేషన్ల అంశంపై గతంలో కామారెడ్డిలోనే బిసి డిక్లరేషన్ చేసిన నేపథ్యంలో, ఇప్పుడు మళ్లీ అక్కడి నుంచే బిసి రిజర్వేషన్ల పట్ల పార్టీ కట్టుబాటు ప్రకటించడానికి ఏర్పాట్లు వేగవంతం అవుతున్నాయి.
రాహుల్ గాంధీకి ఆహ్వానం
కామారెడ్డి సభకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి నాయకుడు కెసి వేణుగోపాల్‌ను కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆహ్వానించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల పట్ల సంతృప్తిగా ఉన్నారని, వారంతా తమతో ఉన్నారని చాటుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.
Post a Comment