ఖురాన్ బోధనలు మానవాళికి ఋజు మార్గం చూపుతాయి: షేఖ్ అబ్దుల్ బాసిత్
కొత్తగూడెం, డిసెంబర్ 12: పవిత్ర ఖురాన్‌లోని బోధనలు మానవాళి సమగ్ర శ్రేయస్సుకై రూపొందించిన దైవ మార్గదర్శకాలు అని జమాతే ఇస్లామి హింద్ సభ్యులు షేఖ్ అబ్దుల్ బాసిత్ పేర్కొన్నారు. స్థానిక గణేష్ టెంపుల్ సమీపంలోని మెదర్ బస్తీ "మస్జీద్-ఏ-వహీద్"లో శుక్రవారం నమాజ్ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో పుట్టుక, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం చివరికి మరణం అనివార్యమని, వీటి మధ్య ఉన్న జీవితం ఎందుకు ఇచ్చబడిందో ఖురాన్ స్పష్టమైన దివ్య బోధనలతో వివరించిందన్నారు. ఆ బోధనలు అనుసరిస్తూ మంచి పనులు చేస్తేనే మోక్షం, దైవ కరుణ లభిస్తుందని పేర్కొన్నారు.
దేవుడు ఒక్కడే సృష్టికర్త అని, సమస్త మానవాళి ఆయన దాసులమని భావించి సాటి మనుష్యులపై ప్రేమ, కరుణ, మంచితనంతో వ్యవహరించాలన్నారు.
తల్లితండ్రుల పట్ల గౌరవం, పొరుగువారి పట్ల సహాయం, బంధువుల పట్ల సానుభూతి, అలాగే నిరుపేదలు, బాటసారులు, అనాధలను ఆదుకోవడమే ఖురాన్ సూచించిన నీతి మార్గమన్నారు.
అనుక్షణం స్వార్థం మరియు కల్మషం లేకుండా, ప్రేమ, ఆప్యాయతలతో జీవించడం ద్వారానే మోక్షానికి దగ్గరవచ్చని, ఇదే ప్రవక్త ముహమ్మద్ (స) చూపిన జీవన విధానమని తెలిపారు.
కార్యక్రమంలో జమాత్ కొత్తగూడెం అధ్యక్షుడు షారుఖ్ యజ్దానీ, గాజీ సలావుద్దీన్, యూసుఫ్ ఖాన్, జబ్బార్ సాబ్, మస్జీద్ ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment