ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

 

ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియ, నిల్వలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రవాణా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం, మొక్కజొన్న వివరాలను పరిశీలించిన కలెక్టర్ కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పరిశీలన సందర్భంగా ధాన్యం తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా తనిఖీ చేసి నాణ్యత ప్రమాణాలపై ఆరా తీశారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని, రోజులు తరబడి రైతులు వేచి ఉండే పరిస్థితి రాకుండా చూడాలని సూచించారు.

కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను తెలుసుకున్నారు. మొక్కజొన్న రవాణాకు తగినన్ని లారీలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు తెలియజేయగా, వెంటనే అదనపు లారీలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

పి.ఆర్-126 రకం ధాన్యంలో “పిన్ పాయింట్ డ్యామేజ్” కారణంగా రైస్ మిల్లర్లు స్వీకరించడం లేదని రైతులు వివరించగా, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. రైతుల ధాన్యం ఎక్కడా నిల్వ ఉండకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ రైతులు శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, తాగునీరు, తేమ కొలిచే పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉండి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రవాణా, నిల్వ, లోడింగ్ తదితర అంశాల్లో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఈ పరిశీలనలో తాసిల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో భారతి, కొనుగోలు కేంద్రం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.