పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై టీఆర్ఎస్ సాధన సభ..
“నీటి విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకే తెలంగాణ రక్షణ సేన పుట్టింది” – కల్వకుంట్ల కవిత
మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిచేయడమే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు.
సభలో మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పాలమూరు ప్రాంతానికి కృష్ణా నీళ్లు అందలేదని, బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లు గడిచినా పరిస్థితి మారలేదని ఆరోపించారు. “పాలమూరు-రంగారెడ్డి కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేసి 33 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు” అంటూ విమర్శించారు.
“దసరా నాటికి పనులు ప్రారంభించాలి.. లేదంటే పాదయాత్ర”
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను దసరా నాటికి ప్రభుత్వం ప్రారంభించాలని డిమాండ్ చేసిన కవిత, లేకపోతే ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో భారీ పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. లక్ష్మిదేవిపల్లిలో రిజర్వాయర్ నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని డిమాండ్ చేశారు.
“ఇక్కడ రిజర్వాయర్ కడితే రంగారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాలకు, మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీళ్లు అందించవచ్చు” అని తెలిపారు.
బీఆర్ఎస్ పాలనపై కూడా విమర్శలు
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకులపై విమర్శలు చేసి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కూడా ప్రజలకు నీళ్లు ఇవ్వడంలో విఫలమైందని కవిత వ్యాఖ్యానించారు. జురాల నుంచి నీళ్లు తీసుకొచ్చే ప్రణాళికను మార్చి శ్రీశైలంకు సోర్స్ పాయింట్ మార్చడం వల్లే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌తో నీటి వివాదాలు పెరిగాయని ఆరోపించారు.
“రిజర్వాయర్లు కట్టారు కానీ నీళ్లు పొలాలకు వెళ్లే చిన్న కాలువలు మాత్రం నిర్మించలేదు. కమిషన్ల కోసం పనులు చేశారు కానీ ప్రజలకు ప్రయోజనం చేకూరలేదు” అని విమర్శించారు.
“వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తాం”
తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక వాటర్ కమిషన్ ఏర్పాటు చేసి నీటి నిర్వహణ మొత్తం దాని ఆధ్వర్యంలో చేపడతామని కవిత హామీ ఇచ్చారు. సాగుకు అనువైన ప్రతి గుంట భూమికి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందిస్తామని పేర్కొన్నారు.
చెరువులు నింపడమే కాకుండా నీరు పొలాల వరకు చేరేలా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, చెరువుల పర్యవేక్షణకు ప్రత్యేక లష్కర్లను నియమిస్తామని తెలిపారు.
“పాలమూరుకు కృష్ణా నీళ్లు రాలేదు”
మహబూబ్‌నగర్ జిల్లాలో 300 కిలోమీటర్ల మేర కృష్ణా నది ప్రవహిస్తున్నా స్థానిక రైతులకు నీళ్లు అందకపోవడం దురదృష్టకరమని కవిత అన్నారు. బీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులు కూడా పూర్తిస్థాయిలో పూర్తి కాలేదని తెలిపారు.
“ఆంధ్రప్రదేశ్ 770 టీఎంసీల కృష్ణా జలాలు వినియోగించుకోగా తెలంగాణ కేవలం 221 టీఎంసీలే వినియోగించుకుంది” అని పేర్కొన్నారు.
కేంద్రంపై కూడా విమర్శలు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని కవిత విమర్శించారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ప్రధాని మోదీని కలిసి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని కోరారు.
అలాగే బీసీ జనగణనలో ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.
“నీళ్ల కోసం మరో ఉద్యమం ప్రారంభం”
“నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇప్పుడు ఆ నీళ్లు ప్రజలకు అందే వరకు తెలంగాణ రక్షణ సేన పోరాటం కొనసాగుతుంది” అని కవిత ప్రకటించారు. ప్రజలు తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Post a Comment