రసవత్తరంగా ఉమ్మడి కడప జడ్పిటిసి ఉప ఎన్నికలు – పులివెందులలో రాజకీయ హోరాహోరీ!
ఉమ్మడి కడప జిల్లాలో జరుగుతున్న రెండు జడ్పిటిసి ఉప ఎన్నికలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాల కోసం 12వ తేదీ పోలింగ్ జరగనుండగా, నువ్వా నేనా అన్నట్లు ప్రచారం ఉత్కంఠ రేపింది.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లాలోనే జరుగుతున్న ఈ ఎన్నికలు, అసెంబ్లీ స్థాయి రాజకీయ వేడిని సృష్టించాయి. పులివెందుల వైఎస్ కుటుంబ బలమైన కోటైనా, ఈసారి టిడిపి బలమైన పోటీ ఇస్తోంది. టిడిపి అభ్యర్థి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థిని ఎదుర్కొంటూ హోరాహోరీగా పోటీ చేస్తున్నారు.
ఆదివారం సాయంత్రం ప్రచారానికి తెరపడగా, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పులివెందులలో 5, ఒంటిమిట్టలో 4 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన పోలీసులు, మొత్తం 1,200 మంది బలగాలను మోహరించారు.
ఇక ఎన్నికల్లో డబ్బు ప్రభావం చర్చనీయాంశమైంది. ఒక్కో ఓటు కోసం రూ.10,000 పైగా చెల్లించేందుకు సిద్దమై ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పులివెందుల స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుచుకోవాలన్న కసితో వైసీపీ పూర్తి శక్తులు ప్రయోగిస్తుండగా, టిడిపి కూడా ప్రతిష్టాత్మక పోరాటం చేస్తోంది.
ఈ రెండు సీటింగ్ స్థానాలు గతంలో వైసీపీకే చెందినవే. ఈ సారి రెండూ కాకపోయినా, కనీసం పులివెందుల గెలుపుతో వైఎస్ జగన్ ప్రతిష్టను నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు.
Post a Comment