ఏపీలో జంట హత్యల కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీ, కూతుళ్ల మృతదేహాలు
ఏపీలో జంట హత్యల కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీ, కూతుళ్ల మృతదేహాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామ పరిధిలోని జీడిమామిడి తోటలో తల్లీ, కూతుళ్లు హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తోటలో ఇద్దరూ నిర్జీవంగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. ఆధార్ కార్డు సహా ఇతర ఆధారాల ఆధారంగా మృతులను తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లికి చెందిన వెంకటలక్ష్మి, ఆమె కుమార్తె వరలక్ష్మిగా గుర్తించారు. వెంకటలక్ష్మి అంధురాలు కాగా, ఆమె ఏలూరు నగరపాలక సంస్థలో స్వీపర్‌గా పనిచేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది.
పోలీసుల పరిశీలనలో ఇద్దరి శరీరాలపై బలమైన గాయాలున్నట్లు గుర్తించారు. అలాగే తల్లీ, కూతుళ్ల మృతదేహాలు వేర్వేరు ప్రదేశాల్లో పడి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఘటనాస్థలంలో వారి బ్యాగులు కూడా లభించగా, అందులోని వస్తువులు చెల్లాచెదురుగా పడివున్నాయి.
ఈ నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘటన వెనుక వ్యక్తిగత విభేదాలున్నాయా, దోపిడీ ప్రయత్నమా, లేక మరేదైనా కారణమా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
గ్రామ శివారులోని తోటలో ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, హత్యలకు పాల్పడిన నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఆధారాల సేకరణతో పాటు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Post a Comment