జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గ్లామర్ పావులు – చిరంజీవి, నాగార్జున పేర్లపై కాంగ్రెస్‌లో చర్చ
హైదరాబాద్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ బరిలో బలమైన పావులు కదుపుతోంది. ముఖ్యంగా, ఈ సీటు గెలిచిన అభ్యర్థికి నేరుగా హోంమంత్రి పదవి ఇస్తామని అధికార వర్గాలు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందినట్లు తెలుస్తోంది. అభ్యర్థి ప్రకటించే సమయంలోనే హోంమంత్రి పదవి హామీ ఇవ్వాలని, ఆ ప్రకటనతో స్థానిక నాయకులు, క్యాడర్ ఉత్సాహంతో గెలుపు కోసం కృషి చేస్తారని అంచనా వేస్తున్నారు.
సినీ తారలపై దృష్టి
బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ హైకమాండ్ సినీ తారల వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవితో సీఎం రేవంత్ చర్చించినట్టు పార్టీ వర్గాల సమాచారం. ప్రారంభంలో ఆసక్తి చూపని చిరంజీవి, హోంమంత్రి ఆఫర్ రావడంతో ఆలోచనలో పడ్డారని ప్రచారం.
ఒకవేళ చిరంజీవి పోటీకి రాకపోతే, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నటుడు నాగార్జున పేరును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని పార్టీ లోపలి వర్గాలు చెబుతున్నాయి. నాగార్జునతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం.
ఇండస్ట్రియలిస్టుల పేర్లూ లిస్టులో
సినీ తారలు ఇద్దరూ నిరాకరిస్తే, జూబ్లీహిల్స్‌లోనే నివాసముంటున్న పలువురు పారిశ్రామిక వేత్తల పేర్లను కూడా కాంగ్రెస్ పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తోంది.
ఈ ఉప ఎన్నికలో గ్లామర్, వ్యూహం, హామీల మేళవింపుతో కాంగ్రెస్ బరిలోకి దిగితే, రాజకీయ రంగంలో ఆసక్తికర పరిస్థితులు నెలకొనవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Post a Comment