సింగరేణిలో ఘోర ప్రమాదం – కార్మికులకు తీవ్రంగా గాయాలు
భూపాలపల్లి : సింగరేణి భూపాలపల్లి కేటీకే-6 ఇంక్లైన్‌లో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గని లోపల ఆకస్మికంగా పైకప్పు (రూఫ్) కూలిపోవడంతో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో కార్మికులు మనోజ్, మొండయ్య తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే బయటకు తీసి స్థానికంగా ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సింగరేణి యాజమాన్యం హైదరాబాద్‌కు తరలించింది.
అదనంగా, ఈ ఘటనలో మరికొందరు కార్మికులు కూడా గాయపడ్డారని సమాచారం. వారి పరిస్థితి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రమాదం కారణంగా గనిలో ఒక్కసారిగా కలకలం రేగింది. సహచరులు ఆందోళన చెందారు.
ఈ ఘటనపై హెచ్‌ఎంఎస్ కేంద్ర కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామి స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణలోపాలే ఈ ప్రమాదానికి కారణమని ఆయన ఆరోపించారు. గనుల తనిఖీలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విమర్శించారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
సింగరేణి గనుల్లో మళ్లీ ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోవడం కార్మికుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. గాయపడిన కార్మికుల ప్రాణాపాయం తప్పాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
Post a Comment