హైదరాబాద్‌లో కుంభవృష్టి.. ముగ్గురు యువకులు గల్లంతు!
హైదరాబాద్, సెప్టెంబర్ 15 : రాజధానిని భారీ వర్షాలు అల్లకల్లోలం చేశాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వాన మంగళవారం ఉదయం వరకు కొనసాగడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు వరదలతో ముగ్గురు యువకులు గల్లంతవడం విషాదకరంగా మారింది.
ఆసిఫ్‌నగర్–హబీబ్‌నగర్ మాంగారిబస్తీకి చెందిన మామా–అల్లుళ్లు అర్జున్(26), రాము(25) ఇద్దరు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో ఘటనలో ముషీరాబాద్–వినోదానగర్‌లో నాలాలో పడిన యువకుడు సన్నీ కొట్టుకుపోయాడు. ముగ్గురి కోసం రక్షణ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
షేక్‌పేట, మణికొండ, నార్సింగి, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, రాయదుర్గం, టోలిచౌకి, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, నాంపల్లి, అబిడ్స్, గోషామహల్ ప్రాంతాలు వర్షంతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయి వాహన రాకపోకలు స్తంభించాయి.
వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం మరికొన్ని గంటల పాటు వర్షం కొనసాగే అవకాశముందని హెచ్చరించింది. అధికారులు ప్రజలను అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Post a Comment