హైకోర్టు స్టే – కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం: మామిళ్ల ఆంజనేయులు

హైకోర్టు స్టే – కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం: మామిళ్ల ఆంజనేయులు


మెదక్, అక్టోబర్ 9 : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమని, ఇది బీసీలను వంచించడానికి చేసిన ప్రయత్నమని మెదక్ పట్టణ బీఆర్‌ఎస్ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు మండిపడ్డారు.

42 శాతం బీసీ రిజర్వేషన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ను హైకోర్టు నిలిపివేయడంతో, ఆ జీవో చట్టబద్ధత నిరూపించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు.

ఆంజనేయులు మాట్లాడుతూ, “కేవలం బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం మాత్రమే ఇది. 42 శాతం రిజర్వేషన్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన డ్రామా ఇది” అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

“కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై నిజమైన నిబద్ధత ఉంటే, ఆ రిజర్వేషన్‌ను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చే దిశగా పార్లమెంటులో పోరాడాలి. హైకోర్టులో నిలబడదని తెలిసి కూడా ఒక అబద్ధపు జీవో తెచ్చి నాలుగు నెలలుగా ప్రజలను మోసం చేశారు,” అని ఆయన అన్నారు.

హైకోర్టు స్టేతో కాంగ్రెస్ ప్రభుత్వ నిజస్వరూపం బయటపడిందని ఆంజనేయులు పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేయాలంటే ఇప్పటికైనా చట్టబద్ధత కోసం జీవోను 9వ షెడ్యూల్‌లో చేర్చే చర్యలు తీసుకోవాలని సూచించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.