నవ మహిళా సాధికార కేంద్రంలో 72వ అఖిలభారత సహకార ఉత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ: నవ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాలలో భాగంగా స్థాపించిన నవ మహిళా సాధికార కేంద్రంలో 72వ అఖిలభారత సహకార ఉత్సవాలు మరియు యోగ్యత పత్రాల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నవ మహిళా పొదుపు మరియు పరస్పర సహకార సంఘం ఏర్పాటు చేసింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా KCTC వరంగల్ లెక్చరర్ పి. రాజయ్య, SBI సీల్ బ్రాంచ్ మేనేజర్ భావ్ సింగ్, కోఆపరేటివ్ సోసైటీ ఆడిటర్ వరుణ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సహకార జెండా ఆవిష్కరణతో ప్రారంభించి సహకార ఉద్యమ గీతాన్ని ఆలపించారు.
నవ మహిళా త్రిఫ్ట్ అధ్యక్షురాలు టి. అరుణ మాట్లాడుతూ, 2018 జనవరిలో సంఘం ప్రారంభమైనప్పటి నుంచి ఒక కోట్ల రూపాయల విలువైన తాటి ఆకుల బుట్టలు మరియు దుస్తుల కుట్టు పనుల ఆర్డర్లను సాధించామని తెలిపారు. ఇప్పటివరకు 200 మంది మహిళలకు 50% సబ్సిడీతో కుట్టుమిషన్లు అందించామని చెప్పారు. అలాగే తయారు చేసిన తాటి ఆకుల బుట్టలను అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, శ్రీలంక దేశాలకు ఎగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు.
అతిథుల చేతుల మీదుగా బ్యూటీషియన్, టైలరింగ్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వంటి కోర్సులు పూర్తి చేసిన మహిళలకు యోగ్యత పత్రాలు మరియు రూ. 77,759 విలువైన చెక్కులు పంపిణీ చేశారు.
అతిథులు మాట్లాడుతూ మహిళా ఆర్థిక స్వావలంబనకు "నవ లిమిటెడ్" మరియు "నవ మహిళా సహకార సంఘం" చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శిక్షణలు ఇవ్వడం వల్ల మహిళలు నిజమైన అర్థంలో సాధికారత సాధిస్తున్నారని తెలిపారు.
CSR జనరల్ మేనేజర్ ఎం.జి.ఎం. ప్రసాద్ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఈ సాధికార కేంద్రంలో 4,000 మందికి పైగా మహిళలు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందారని తెలిపారు. అందులో 75% మహిళలు ఇంటివద్దే టైలరింగ్, బ్యూటీషియన్ పనులు చేస్తూ ఆర్థికంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు.
కార్యక్రమంలో DGM (ఫైనాన్స్) ఎన్. సత్యనారాయణ, సభ్యులు అమ్ముద, స్వరూప, కవిత, అరుణ, రాజేశ్వరరావు, వెంకన్న, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment