ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఈవీ వాహనాల కొనుగోలుపై 20 శాతం వరకు డిస్కౌంట్
హైదరాబాద్, జనవరి 06: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన మంత్రి, రాష్ట్రంలో ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశామని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వాలని వాహన తయారీ కంపెనీలను ప్రభుత్వం కోరిందన్నారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ఆర్థిక భారమూ తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
సంస్థలకూ ఈవీ తప్పనిసరి దిశగా చర్యలు
భవిష్యత్తులో రాష్ట్రంలోని ఎంఎన్సీ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు తమ వాహనాల్లో 25 నుంచి 50 శాతం వరకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేలా నిర్బంధ విధానం తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి వెల్లడించారు. ఈ విధానం అమలైతే రాష్ట్రంలో ఈవీ వినియోగం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు.
పర్యావరణహిత రవాణానే లక్ష్యం
ఇంధన వ్యయాన్ని తగ్గించడం, వాయు కాలుష్యాన్ని నియంత్రించడం, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈవీ పాలసీని రూపొందించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో మరిన్ని చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఈవీ వినియోగదారులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ తాజా నిర్ణయాలతో ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మరింత ఆసక్తి చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment