భద్రాచలంలో 50.4 కిలోల గంజాయి స్వాధీనం ఒడిశా నుంచి కేరళకు కారులో అక్రమ రవాణా
భద్రాచలం పట్టణ పరిధిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా నుంచి కేరళకు కారులో అక్రమంగా తరలిస్తున్న 50.4 కిలోల గంజాయిని, అలాగే రూ.17,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ కే. తిరుపతి ఆధ్వర్యంలో, ఎస్‌ఐ చె. శ్రీహరి రావు మరియు సిబ్బంది భద్రాచలం–నెల్లిపాక రహదారిపై తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో భద్రాచలం ఇసుక రీచ్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన FIAT కారును ఆపి తనిఖీ చేయగా, అందులో 50.4 కిలోల గంజాయి లభ్యమైంది.
తదుపరి విచారణలో, గంజాయిని ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా నుంచి తిరువనంతపురం (కేరళ)కు తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. ఈ ఘటనలో
A1) అక్షయ్ సురేష్,
A2) కుంజుమాన్ సురేంద్రన్ మినిమోల్,
A3) అనంత కృష్ణన్
అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణ నిమిత్తం గంజాయి, FIAT కారు, ముగ్గురు నిందితులు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.17,000 నగదులను స్వాధీనం చేసి భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ రూ.28 లక్షల 70 వేలుగా అధికారులు అంచనా వేశారు.
ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ యం.ఏ. కరీం, కానిస్టేబుల్స్ సుధీర్, వెంకట్, హనుమంతరావు, వీరబాబు, ఉపేందర్ పాల్గొన్నారు.
గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ బృందాన్ని తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి. జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి. గణేష్ అభినందించారు.
గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2523కు తెలియజేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కే. తిరుపతి తెలిపారు.

Post a Comment