వీధి కుక్కల దాడులు ప్రభుత్వ వైఫల్యమే: సుప్రీంకోర్టు

వీధి కుక్కల దాడులు ప్రభుత్వ వైఫల్యమే: సుప్రీంకోర్టు


జనవరి 13: వీధి కుక్కల దాడుల అంశంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చిన్నారులు లేదా వృద్ధులపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచినా లేదా ప్రాణాలు కోల్పోయినా, అందుకు రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.

ఈ అంశంపై విచారణ సందర్భంగా స్పందించిన జస్టిస్ విక్రమ్ నాథ్, వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారూ బాధ్యత వహించాల్సిందేనని వ్యాఖ్యానించారు. కుక్కలకు ఆహారం పెట్టాలనుకుంటే వాటిని తమ ఇళ్లకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.

కుక్కల సమస్య భావోద్వేగపూరితమని లాయర్ మేనకా గురుస్వామి చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం స్పందిస్తూ, “ఇప్పటివరకు భావోద్వేగాలు కుక్కలకే ఉన్నట్లున్నాయి” అని వ్యాఖ్యానించింది. దీనికి ఆమె స్పందిస్తూ, తాను కూడా మనుషుల భద్రత గురించే ఆలోచిస్తున్నానని తెలిపారు.

ఇదే సందర్భంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, క్రీడా ప్రాంగణాలు, రైల్వే స్టేషన్ల వంటి ప్రజా ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించి, వాటిని నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని ఆదేశించింది. పట్టుకున్న కుక్కలను తిరిగి అదే ప్రాంతంలో వదలకూడదని స్పష్టం చేసింది.

వీధి కుక్కల దాడుల అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ కేసును విచారిస్తోంది. ప్రభుత్వ, ప్రజా సంస్థల ప్రాంగణాల్లో కుక్కలు లేవని నిర్ధారించుకునేందుకు అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని ఆదేశించింది. ఇలాంటి ప్రదేశాల్లో కుక్కల దాడులు జరగడం అధికారుల నిర్లక్ష్యానికి, వ్యవస్థాగత వైఫల్యానికి నిదర్శనమని కోర్టు అభిప్రాయపడింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.