26 నుంచి బడ్జెట్ సమావేశాలు.. 15 రోజుల పాటు శాసనసభ
హైదరాబాద్, ఫిబ్రవరి 20: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రాథమికంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఫిబ్రవరి 28న 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
అయితే, పరిషత్ ఎన్నికల అంశంపై ప్రభుత్వం ఇంకా తర్జనభర్జనలోనే ఉంది. మార్చి 10లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి తర్వాత బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు, పరిషత్ ఎన్నికల షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఉత్సాహంతో పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని సీఎం భావించినప్పటికీ, మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావడం వల్ల ఆలోచనలో పడినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఎన్నికల ప్రక్రియను మార్చి 10లోపు ముగిస్తే పరీక్షలకు ఎలాంటి అంతరాయం ఉండదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
ఎన్నికలను ఏప్రిల్‌కు వాయిదా వేయాలా? లేక పరీక్షలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకుని మార్చి 10లోపు పూర్తి చేయాలా? అన్న అంశాలపై చర్చ జరుగుతోంది. ఎన్నికలను వాయిదా వేసే నిర్ణయం తీసుకుంటే ఫిబ్రవరి 26 నుంచే బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశముందని సమాచారం.
అన్ని అంశాలపై ఈ నెల 23న జరిగే క్యాబినెట్ సమావేశంలో స్పష్టత రానుంది.

Post a Comment