భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం

 

పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహణ : జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ పరీక్షా కేంద్రాల్లో ఈ ప్రాక్టికల్ పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.

ఈరోజు నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షల వివరాలను ఆయన వెల్లడించారు. ఉదయం సెషన్‌లో జనరల్ కోర్సులో 974 మంది విద్యార్థులకు గాను 948 మంది పరీక్షలకు హాజరుకాగా 26 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ కోర్సులో 1,381 మందికి గాను 1,324 మంది హాజరుకాగా 57 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 2,365 మందికి గాను 2,182 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై 83 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.

అలాగే మధ్యాహ్నం సెషన్‌లో జనరల్ కోర్సులో 703 మందికి గాను 685 మంది పరీక్షలకు హాజరుకాగా 17 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ కోర్సులో 1,362 మందికి గాను 1,296 మంది హాజరై 66 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 2,065 మందికి గాను 1,982 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 83 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

ప్రాక్టికల్ పరీక్షల ప్రారంభ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు మణుగూరు, ఎడులబయ్యారం, భద్రాచలం ప్రాంతాల్లోని ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ల్యాబ్ సదుపాయాలు, హాజరు నమోదు విధానం, ప్రశ్నపత్రాల గోప్యత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మరియు ఇంటర్మీడియట్ విద్యామండలి జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కళాశాల యాజమాన్యాలు, పరీక్షా సిబ్బందికి సూచించారు.

మిగిలిన రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను ఇదే విధంగా శాంతియుతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.