గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు నాయకత్వం వహించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

 

గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు నాయకత్వం వహించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 17: గ్రామాల సమగ్రాభివృద్ధిలో గ్రామపంచాయతీ సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, ప్రభుత్వం అందిస్తున్న నిధులను నియమ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా వినియోగించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సర్పంచులకు పిలుపునిచ్చారు.

నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక రెండవ విడత శిక్షణ కార్యక్రమం మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కెఎస్ఎం ఓల్డ్ క్యాంపస్)లో జరిగింది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 471 మంది గ్రామపంచాయతీ సర్పంచులకు విడతల వారీగా శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. రెండవ విడత శిక్షణ కార్యక్రమం 17-02-2026 నుండి 21-02-2026 వరకు కొనసాగుతుందని వెల్లడించారు.

233 మంది సర్పంచులకు శిక్షణ

రెండవ విడతలో భాగంగా అశ్వరావుపేట, దమ్మపేట, దుమ్ముగూడెం, ములకలపల్లి, జూలూరుపాడు, టేకులపల్లి, ఇల్లందు, లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన 233 మంది నూతన సర్పంచులు శిక్షణలో పాల్గొంటున్నారు. గ్రామ పాలన, పరిపాలన విధానాలు, బాధ్యతలు, కర్తవ్యాలపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ శిక్షణ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.

శిక్షణలో భాగంగా పంచాయతీ రాజ్ చట్టం, గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలు విధానం, ఆర్థిక నిర్వహణ, సామాజిక బాధ్యతలు, పారదర్శక పాలన అంశాలపై సవివరంగా మార్గనిర్దేశం చేయనున్నారు.

మౌలిక వసతులకు ప్రాధాన్యం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గ్రామపంచాయతీలకు అందుతున్న అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించి తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్యుత్, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వీధిదీపాలు, విద్యుత్ స్తంభాలు, పబ్లిక్ టాయిలెట్లు వంటి వసతుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.

అలాగే ప్రతి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరును సర్పంచులు నిరంతరం పర్యవేక్షించి చిన్నారులు, బాలింతలకు పోషకాహారం సక్రమంగా అందుతున్నదీ లేదో పరిశీలించాలని సూచించారు. అక్షరాస్యత పెంపు, విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

పర్యాటక, ఉపాధి అవకాశాల వినియోగం

జిల్లాలో ఉన్న పర్యాటక అవకాశాలను సద్వినియోగం చేసుకుని గ్రామాల ఆర్థికాభివృద్ధికి దోహదపడే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇల్లందు పూబెల్లి, రోళ్ళపాడు, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి ప్రాంతాల్లోని కారుకొండ, జూలూరుపాడు ప్రాంతంలోని వ్యవసాయ విశిష్టతలను విస్తృతంగా ప్రచారం చేస్తే పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందే అవకాశముందని తెలిపారు.

సర్పంచులు పంచాయతీ శాఖకే పరిమితం కాకుండా గ్రామంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్ప, ఇప్పపువ్వు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా గ్రామస్తులకు అదనపు ఆదాయ వనరులు సృష్టించవచ్చని, పశుసంపద అభివృద్ధి, మేత సంపద పెంపుతో ప్రభుత్వ సబ్సిడీలను పొందే అవకాశముందని వివరించారు.

18 నుండి 20 సంవత్సరాల లోపు నిరుద్యోగ యువతపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా యంత్రాంగం నిర్వహించే ఇంటర్వ్యూలు, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించి యువతను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సర్పంచులను కోరారు.

శిక్షణ కిట్ల పంపిణీ

కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సర్పంచులకు శిక్షణ కిట్లను అందజేశారు. గ్రామ పాలనకు అవసరమైన మార్గదర్శక పుస్తకాలు, చట్టపరమైన సూచనలు, అభివృద్ధి పథకాల సమాచార పత్రాలు తదితర అంశాలు కిట్లలో అందజేయబడినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డీపీఓ సుధీర్, శిక్షణ డీపీఓ అనూష, డీఎల్పీఓలు ప్రభాకర్, రమణ, టీజీఐఆర్టీ సెంటర్ హెడ్ సుభాష్ చంద్ర గౌడ్, ట్రైనర్లు బన్సింగ్, రవీందర్ రెడ్డి, సునీల్ కుమార్, ముత్యాలరావు, హజ్‌రత్ వలి, ఏపీవో రంగ, ఎస్‌బీఎం రేవతి, డిటిఎం సందీప్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.