రంజాన్ రోజా – ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం
గోదావరిఖని: రంజాన్ నెల సందర్భంగా అశోక్‌నగర్ ఉర్దూ మీడియం స్కూల్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన మెడికో డాక్టర్ హఫ్సా యూసుఫ్ ముఖ్య అతిథిగా హాజరై “రంజాన్ రోజా – ఆరోగ్యం” అనే అంశంపై ప్రసంగించారు.
కార్యక్రమంలో మాట్లాడిన డాక్టర్ హఫ్సా యూసుఫ్, “రంజాన్ పవిత్రమైన నెల. ఈ నెలలో పాటించే రోజా అల్లాహ్ మనపై ఫర్జ్ చేసిన ఒక గొప్ప ఇబాదత్. రోజా అనేది కేవలం ఆకలిగా ఉండటం మాత్రమే కాదు, అది మన ఆత్మను శుద్ధి చేసే శిక్షణ” అని పేర్కొన్నారు.
ఆమె వివరించుతూ, రోజా వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. రోజా సమయంలో మెటబాలిజం మెరుగుపడుతుందని, శరీరంలో చెడు కొవ్వు తగ్గి ఆరోగ్యం పెరుగుతుందని చెప్పారు. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. డిటాక్సిఫికేషన్ ప్రక్రియ ద్వారా శరీరం శుభ్రపడటంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆమె తెలిపారు.
గుండె ఆరోగ్యానికి కూడా రోజా ఎంతో మేలు చేస్తుందని, చెడు కొలెస్ట్రాల్ తగ్గి హృదయ సంబంధిత సమస్యలు తగ్గే అవకాశాలు ఉంటాయని డాక్టర్ హఫ్సా యూసుఫ్ వెల్లడించారు. అంతేకాక రోజా మనకు సహనం, నియమం, ఆత్మ నియంత్రణ వంటి గొప్ప విలువలను నేర్పుతుందని చెప్పారు. కోరికలను అదుపులో పెట్టుకొని అల్లాహ్ ప్రసన్నత కోసం జీవించటం రోజా ద్వారా సాధ్యమవుతుందని వివరించారు.
ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా జమాత్-ఇ-ఇస్లామీ హింద్ మహిళా విభాగం అధ్యక్షురాలు జువేరియా కౌసర్ అధ్యక్షత వహించారు. ఆమె కూడా రంజాన్ రోజా యొక్క ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య ప్రాముఖ్యతపై ప్రసంగిస్తూ, భక్తితో మరియు శ్రద్ధతో రోజాను పాటించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో స్థానిక ప్రెసిడెంట్ సబీరా నాజ్, దావా సెక్రటరీ ఐషా సిద్దిఖా, రఫతున్నిస్సా, నిఖత్, నుస్రత్, నాజియా, షహెదా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగి విజయవంతంగా ముగిసింది.

Post a Comment