భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు

 

భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు

కొత్తగూడెం లీగల్: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పు వెలువరించారు.

కేసు వివరాల ప్రకారం… చుంచుపల్లి మండలం విద్యానగర్‌కు చెందిన లాకవత్ సైదులు తన పెద్ద కుమార్తె స్నేహాను ఖమ్మం జిల్లా (ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా) గార్ల మండలం పుల్లూరు గ్రామం కట్టుకుంట తండాకు చెందిన భూక్య శ్రీధర్‌కు 2021 జూలై 30న వివాహం జరిపించారు. వివాహం తర్వాత కొద్ది రోజుల పాటు బాగానే ఉన్నప్పటికీ, భర్తతో పాటు అత్తమామల వేధింపులు పెరగడంతో స్నేహా పలుమార్లు తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చేది.

కుటుంబ సభ్యులు సర్దిచెప్పి మళ్లీ భర్త ఇంటికి పంపించినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2023 మే 20న ఉదయం సుమారు 11 గంటల సమయంలో భూక్య శ్రీధర్ తన భార్య స్నేహాపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు వెల్లడైంది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న స్నేహా సోదరి నీలా ఈ విషయాన్ని పక్కింటి లక్ష్మీనారాయణ సెల్‌ఫోన్ ద్వారా తల్లికి తెలియజేసింది.

తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని తీవ్ర కాలిన గాయాలతో ఉన్న స్నేహాను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై స్నేహా తండ్రి లాకవత్ సైదులు చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై కె. సుమన్ కేసు నమోదు చేయగా, ఇన్‌స్పెక్టర్ ఏ. రమాకాంత్ దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

కోర్టు విచారణలో మొత్తం 17 మంది సాక్షులను విచారించారు. నేరం రుజువైన నేపథ్యంలో భూక్య శ్రీధర్‌కు జీవిత ఖైదు మరియు రూ.1000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.

అయితే అత్త భూక్య అచ్చమ్మ, మామ భూక్య బాసు @ భాస్కర్‌లపై నేరం రుజువు కాకపోవడంతో వారిని కేసు నుంచి విముక్తి కల్పించారు.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి వాదనలు వినిపించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్సై డి. రాఘవయ్య, కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎన్. వీరబాబు (కోర్టు డ్యూటీ ఆఫీసర్), హెడ్ కానిస్టేబుళ్లు లచ్చూ, పి. సుమన్‌లు సహకరించారు.

Blogger ఆధారితం.