అంగన్వాడీ చిన్నారులకు ఎస్బీఐ CSR ద్వారా లక్ష రూపాయల సామగ్రి పంపిణీ
పాల్వంచ, కొత్తగూడెం: పాల్వంచ మరియు కొత్తగూడెం ప్రాజెక్టుల పరిధిలోని పాలకోయతండా, రామవరం-9 అంగన్వాడీ కేంద్రాలకు State Bank of India (ఎస్బీఐ) పాన్ ఇండియా CSR కార్యక్రమం కింద విలువైన సామగ్రిని పంపిణీ చేసింది. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల అభివృద్ధి, విద్యాపట్ల ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా పలు ఉపయోగకరమైన వస్తువులు అందజేశారు.
ఎస్బీఐ తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆటవస్తువులు, జారుడు బల్లలు, వాటర్ ఫిల్టర్లు, ఎల్ఈడి టీవీలు, రైస్ కుక్కర్లు, ప్లేట్లు, గ్లాసులు, స్కూల్ బ్యాగులు, వర్క్‌బుక్స్, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ తదితర సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మిత్రా హోలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనిన్ మాట్లాడుతూ, ఎస్బీఐ తమ CSR నిధుల ద్వారా ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి లక్ష రూపాయల విలువైన సామగ్రి అందించడం అభినందనీయం అన్నారు. ఈ వనరులు చిన్నారుల మేధో వికాసానికి దోహదపడటమే కాకుండా, విద్య పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీఐ సిల్ క్యాంపస్ బ్రాంచ్ మేనేజర్ భావ్ సింగ్, రుద్రంపూర్ బ్రాంచ్ మేనేజర్ వెంకట రమణ, సీడీపీఓలు ప్రసన్న, పద్మశ్రీ, కార్పొరేటర్లు శ్యామల, కంచర్ల హిమశ్రీ, అంగన్వాడీ టీచర్లు జ్యోతి, పద్మ, చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment