ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటల వీడియోలు తీశిన ఏఎస్సై సస్పెండ్
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రజల భద్రత కోసం పనిచేయాల్సిన పోలీస్ అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నీచమైన చర్యలకు పాల్పడిన విషయం బయటపడింది. మాచర్లలో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేపట్టగా, ఆరోపణలు నిజమని తేలడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇటువంటి చర్యలకు పాల్పడటం పోలీస్ శాఖకు మచ్చగా మారింది.
ఆటో డ్రైవర్‌తో కలిసి బ్లాక్‌మెయిల్
విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఏఎస్సై శ్రీనివాసరావు ఒక ఆటో డ్రైవర్‌ను సహాయకుడిగా ఉపయోగించుకున్నాడు. జంటలు ఏకాంతంగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని, వారి వ్యక్తిగత క్షణాలను రహస్యంగా వీడియోలు తీయించేవాడు.
ఆ వీడియోలను చూపిస్తూ బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, సోషల్ మీడియాలో పెట్టేస్తానని భయపెట్టి మహిళలు, యువతులపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వైరల్ వీడియోలతో బయటపడ్డ ఘటన
ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం శాఖాపరమైన చర్యలు కొనసాగుతుండగా, త్వరలోనే క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
ఇలాంటి ఘటనలపై ప్రజలు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

Post a Comment