తాత అంత్యక్రియలకు వెళ్తున్న మనవడు గుండెపోటుతో మృతి

తాత అంత్యక్రియలకు వెళ్తున్న మనవడు గుండెపోటుతో మృతి


జన్నారం మండలం, ఏప్రిల్ 02: మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తాత అంత్యక్రియలకు వెళ్తున్న మనవడు మార్గమధ్యలో గుండెపోటుకు గురై మృతి చెందాడు.

జన్నారం మండలం పొనకల్ గాంధీనగర్‌కు చెందిన సంకపాగ దేవన్న (35) గురువారం ఉదయం ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యాడు. స్థానికంగా ఒక మెడికల్ స్టోర్‌లో పనిచేస్తున్న దేవన్న, కుటుంబ సభ్యులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామానికి బయలుదేరాడు. అక్కడ మరణించిన తన తాత వరుసకు చెందిన డి. చిన్నరాజన్న అంత్యక్రియలకు హాజరుకావడానికి వెళ్తున్నాడు.

ప్రయాణంలో భాగంగా నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ వద్దకు చేరుకున్న సమయంలో దేవన్నకు అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో బస్సు దిగాడు. అనంతరం మరో బస్సులో తిరిగి పొనకల్‌కు చేరుకుని, అక్కడి నుంచి వెంటనే వాహనంలో లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మృతుడు సంకపాగ నర్సింగ్‌కు కుమారుడు కాగా, భార్య వసంత ఉన్నారు. ఇంకా వారికి సంతానం లేదు. దేవన్న మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం పొనకల్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Blogger ఆధారితం.