శ్రీశైలం ఘాట్‌లో అదుపు తప్పిన బస్సు… తృటిలో తప్పిన పెను ప్రమాదం
దోర్నాల: శ్రీశైలం ఘాట్ రోడ్లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా రెండు ఆర్టీసీ బస్సులు అదుపు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
మార్కాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుంచి దోర్నాల వైపు ప్రయాణిస్తోంది. ఘాట్ రోడ్డులో ఎదురుగా వస్తున్న వాహనాలకు సైడ్ ఇస్తూ రోడ్డు మార్జిన్‌లోకి దిగింది. ఇదే సమయంలో స్వల్ప వర్షం కురుస్తుండటంతో పాటు బస్సు వేగం ఎక్కువగా ఉండటంతో డ్రైవర్‌కు నియంత్రణ తప్పింది. దీంతో బస్సు రోడ్డుపక్కన ఉన్న ఇనుప రిటైనింగ్ వాల్‌ను దాటి లోయలోకి దూసుకెళ్లింది.
బస్సులో ఉన్న సుమారు 30 మంది ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేస్తూ భయంతో వణికిపోయారు. అయితే అదృష్టవశాత్తూ లోయలో ఉన్న పెద్ద చెట్లకు బస్సు ఢీకొని అక్కడికక్కడే ఆగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పి అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కొందరికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.
ఇదే సమయంలో ఆ బస్సు వెనుక వస్తున్న మరో ఇంద్ర బస్సు కూడా వేగాన్ని అదుపులో పెట్టలేక రోడ్డు పక్కన ఉన్న రక్షణ ఇనుప కమ్మీలను ఢీకొట్టి ఆగిపోయింది. ఆ బస్సులో ఉన్న 12 మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఘటన సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment