కొండపాక వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

 

కొండపాక వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. కొండపాక శివారులోని రాజీవ్ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్తున్న బోర్ బండి లారీ ఒక్కసారిగా ఎడమ వైపుకు మళ్లింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు.

దీంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ జరగలేదు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న కుకునూరుపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.