పదవీ విరమణ పొందిన నలుగురు పోలీసు అధికారులకు ఘన సన్మానం
భద్రాద్రి కొత్తగూడెం, మే 30: జిల్లా పోలీసు శాఖలో దశాబ్దాల పాటు విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన నలుగురు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘనంగా సత్కరించారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన అధికారులకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, ప్రశంసాపత్రాలు అందజేసి వారి సేవలను కొనియాడారు.
పోలీసు శాఖలో 42 సంవత్సరాల పాటు సేవలందించిన ఎస్సై కసిబోయిన సత్యనారాయణ రాజు, 37 సంవత్సరాల సేవ అనంతరం పదవీ విరమణ పొందిన ఏఎస్సై జంపాల హనుమంతరావు, 41 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సేవలందించిన ఏఆర్ ఎస్సై ధారావత్ వెంకటేశ్వర్లు, అలాగే 36 సంవత్సరాల సేవ అనంతరం అశ్వాపురంలో విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ఎట్టా శ్రీనివాసరావులను ఈ సందర్భంగా సన్మానించారు.
కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన అధికారులు తమ సుదీర్ఘ సేవా కాలంలో ఎదురైన అనుభవాలను పంచుకోగా, వారి కుటుంబ సభ్యులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన అధికారులు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. పోలీసు శాఖలో ఎన్నో సంవత్సరాలు ప్రజాసేవ చేసిన వారి అనుభవాలు కొత్తగా నియమితులైన అధికారులు, సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
పదవీ విరమణ అనంతరం ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించిన ఎస్పీ, ఆరోగ్య పరిరక్షణ కోసం వ్యాయామం, యోగా, ధ్యానం వంటి అలవాట్లు కొనసాగించాలని సూచించారు. అలాగే పదవీ విరమణ పొందిన సిబ్బందికి ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్య, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు, ఎంటీఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment