అకాల వర్షాలతో తడిసినా ధాన్యం కొంటాం : జిల్లా కలెక్టర్ అంకిత్
మిల్లుల వద్ద అన్‌లోడింగ్ ఆలస్యమైతే చర్యలు
రవాణా సమస్యల పరిష్కారానికి శాఖల సమన్వయం
ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తూ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
రవాణా, రెవెన్యూ శాఖల సమన్వయంతో అన్ని రకాల వాహనాలను ధాన్యం రవాణాకు వినియోగిస్తున్నామని, ప్రతి రైస్ మిల్లుకు ప్రత్యేక ఇన్‌ఛార్జ్‌లను నియమించి, అదనపు హమాలీలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. మిల్లుల వద్ద అన్‌లోడింగ్ ప్రక్రియలో ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రస్తుత అకాల వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక అలర్ట్ మెకానిజాన్ని సిద్ధం చేసిందని తెలిపారు. వర్షాల కారణంగా ధాన్యం తడిసినా రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని వెంటనే గుర్తించి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రైతులకు ఎలాంటి నష్టం జరగనివ్వమని స్పష్టం చేశారు.
రెవెన్యూ, సివిల్ సప్లై, రవాణా శాఖలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కోఆర్డినేటర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

Post a Comment