బీఆర్ఎస్‌కు కనకేష్ పటేల్ రాజీనామా.. నాయకత్వ లోపమే కారణమని వ్యాఖ్య

బీఆర్ఎస్‌కు కనకేష్ పటేల్ రాజీనామా.. నాయకత్వ లోపమే కారణమని వ్యాఖ్య

పాల్వంచ, మే 30: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, పాల్వంచ లార్జ్ సైజ్డ్ కో-ఆపరేటివ్ సొసైటీ (ఎల్‌ఎస్‌సీఎస్) ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్ పటేల్ పార్టీ క్రియాశీలక సభ్యత్వంతో పాటు పార్టీ పరమైన అన్ని బాధ్యతలకు రాజీనామా చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు శనివారం రాజీనామా పత్రాన్ని పంపించారు.

తన రాజీనామా లేఖలో కనకేష్ పటేల్ పలు అంశాలను ప్రస్తావించారు. 2014లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ పట్ల తన నిబద్ధతను గుర్తించి 2020లో పాల్వంచ ఎల్‌ఎస్‌సీఎస్ ఉపాధ్యక్ష పదవిని అప్పగించారని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేశానని తెలిపారు.

అయితే గత రెండున్నర సంవత్సరాలుగా కొత్తగూడెం నియోజకవర్గంలో తీవ్ర నాయకత్వ లోపం నెలకొందని, పార్టీని సరైన దిశలో నడిపించే నాయకత్వం లేకపోవడంతో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై చేపట్టాల్సిన కనీస కార్యక్రమాలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

నాయకత్వ వైఫల్యాల కారణంగా నియోజకవర్గంలోని నిజమైన బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, నమ్మకమైన కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని భావించి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరిన కనకేష్ పటేల్, ఇంతకాలం తనకు సహకరించిన పార్టీ శ్రేణులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, తన రాజీనామా పత్రం ప్రతులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావుకు కూడా పంపించారు.

Blogger ఆధారితం.