వరంగల్‌లో కల్తీ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి – రూ.2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం

వరంగల్‌లో కల్తీ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి – రూ.2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం

వరంగల్‌లో కల్తీ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి – రూ.2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం

వరంగల్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి భారీ మొత్తంలో కుళ్లిపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేసి, తదుపరి చర్యల కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు.

పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో ఉన్న ఓ నివాస గృహంలో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో పెద్ద ఎత్తున పచ్చడి తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. అక్కడ నిల్వ ఉంచిన ముడిసరుకులు కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో పాటు, వాటిని చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి స్థానిక కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయటపడింది.

ఈ వ్యవహారంలో కాశీబుగ్గకు చెందిన అరికెల శ్రీనివాస్ (51)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో భాగంగా 750 కిలోల టమోటాలు, 900 కిలోల మామిడికాయలు, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరికాయలు, 150 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్ సహా మొత్తం రూ.2.25 లక్షల విలువైన కుళ్లిపోయిన, కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. బ్రాండ్ లేని లేదా అనుమానాస్పద ఆహార పదార్థాలు, పచ్చళ్లను కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ లేదా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఎ. మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, ఆర్‌ఎస్‌ఐ ఓ. భాను ప్రకాష్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఈ దాడులను విజయవంతంగా నిర్వహించారు.

Blogger ఆధారితం.