కూతురి పెళ్లి సంబంధం చూసి వస్తుండగా విషాదం.. లారీ ఢీకొని దంపతులు మృతి
కూతురి పెళ్లి సంబంధం చూసి వస్తుండగా విషాదం.. లారీ ఢీకొని దంపతులు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో హృదయవిదారక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూతురి పెళ్లి సంబంధం చూసి ఆనందంగా ఇంటికి తిరిగి వస్తున్న దంపతులను మృత్యువు లారీ రూపంలో వెంటాడింది. కుటుంబ సభ్యులు ఎంతగా వారించినా కారులో కాకుండా బైక్‌పై ప్రయాణించిన ఆ దంపతులు మార్గమధ్యలోనే ఘోర ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, సామర్లకోటకు చెందిన జూరెడ్డి వెంకట సూర్యనారాయణ (45), జూరెడ్డి అరుణ కుమారి (40) దంపతులకు ఒక కుమార్తె ఉంది. కుమార్తె వివాహ సంబంధం కోసం కుటుంబ సభ్యులతో కలిసి తుని పట్టణానికి వెళ్లిన వారు, అక్కడ వరుడు కుటుంబంతో చర్చలు జరిపి సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ సందర్భంగా కుటుంబంలోని నలుగురు సభ్యులు కారులో బయలుదేరగా, సూర్యనారాయణ దంపతులు మాత్రం బైక్‌పై రావాలని నిర్ణయించుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, కారులోనే రావాలని కుటుంబ సభ్యులు పలుమార్లు కోరినా వారు వినకుండా ద్విచక్రవాహనంపైనే ప్రయాణం కొనసాగించారు.
అయితే తుని నుంచి సామర్లకోటకు వస్తున్న క్రమంలో చేబ్రోలు దుర్గాడ సమీపంలోకి చేరుకోగానే అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సామర్లకోటలో విషాద ఛాయలు
మృతురాలు అరుణ కుమారి సామర్లకోట ప్రెసిడెంట్ గారి వీధిలో బ్యూటీ పార్లర్, బొటిక్ నిర్వహిస్తూ స్థానికులకు సుపరిచితురాలిగా గుర్తింపు పొందారు. ఆమె భర్త వెంకట సూర్యనారాయణ సామర్లకోటలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
కూతురి పెళ్లి జరిపి ఆనందంగా ఉండాల్సిన తల్లిదండ్రులు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సామర్లకోట పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. వారి ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ దంపతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Post a Comment