లాకప్ డెత్ ఘటనపై తెలంగాణ పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

లాకప్ డెత్ ఘటనపై తెలంగాణ పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

లాకప్ డెత్ ఘటనపై తెలంగాణ పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

సూర్యాపేట జిల్లా కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ కస్టడీలో మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని జిల్లా పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించింది.

తెలంగాణ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేసును స్వీకరించింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, గత ఏడాది నవంబర్‌లో కర్ల రాజేష్‌ను పోలీసులు ఐదు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి, థర్డ్ డిగ్రీ చిత్రహింసలకు గురిచేసిన అనంతరం కస్టడీలో మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు విషయంలో ఫిర్యాదు చేసినందుకే రాజేష్‌ను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, అనంతరం తీవ్రంగా హింసించి మరణానికి కారణమయ్యారని పేర్కొన్నారు. రాజేష్ తల్లి ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, సంబంధిత పోలీసులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సూర్యాపేట జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. పోస్ట్‌మార్టం వీడియో, మేజిస్ట్రియల్ విచారణ నివేదిక, వైద్య రికార్డులు, కస్టడీకి సంబంధించిన అన్ని పత్రాలు, ఇతర సంబంధిత ఆధారాలను కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించింది.

ఈ ఘటనలో వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రత్యేక విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Blogger ఆధారితం.