సింగరేణి అధికారుల సమ్మెకు హెచ్‌ఎంఎస్ సంపూర్ణ మద్దతు.. మణుగూరులో రెండో రోజు నిరాహార దీక్షకు సంఘీభావం
సింగరేణి అధికారుల సమ్మెకు హెచ్‌ఎంఎస్ సంపూర్ణ మద్దతు.. మణుగూరులో రెండో రోజు నిరాహార దీక్షకు సంఘీభావం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలో సింగరేణి అధికారుల సంఘం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొనసాగుతున్న ఈ ఆందోళనకు హెచ్‌ఎంఎస్ (హింద్ మజ్దూర్ సభ) యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా హెచ్‌ఎంఎస్ మణుగూరు వైస్ ప్రెసిడెంట్ కోడిపల్లి శ్రీలత దీక్షా శిబిరాన్ని సందర్శించి అధికారులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా హెచ్‌ఎంఎస్ మణుగూరు బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కోడిపల్లి శ్రీలత మాట్లాడుతూ, సింగరేణి అధికారుల సంఘం చేపట్టిన నిరసన దీక్ష పూర్తిగా న్యాయమైనదేనని పేర్కొన్నారు. అధికారులకు రావాల్సిన పే రివిజన్, గ్రేడేషన్, పదోన్నతి విధానం (ప్రమోషన్ పాలసీ), ఇతర సేవా ప్రయోజనాలు వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అలాగే, సింగరేణి సంస్థకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు రూ.54 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల సింగరేణి సంస్థతో పాటు అధికారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సింగరేణి సంస్థ అభివృద్ధికి అధికారులు, కార్మికులు రెండు కళ్లు లాంటివారని, ఇరువర్గాలు సమన్వయంతో పనిచేస్తేనే సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని శ్రీలత అన్నారు. ప్రస్తుతం కార్మిక హక్కులు కూడా దెబ్బతింటున్నాయని, వాటి పరిరక్షణ కోసం అధికారులు, కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సింగరేణి సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల సాధన కోసం అధికారుల ఉద్యమానికి హెచ్‌ఎంఎస్ యూనియన్ అన్ని విధాలా అండగా నిలుస్తుందని, వారి న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు సంపూర్ణ మద్దతు కొనసాగిస్తామని హెచ్‌ఎంఎస్ నాయకులు స్పష్టం చేశారు.

Post a Comment