స్నేహితుడి దారుణ హత్య.. చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితులు

స్నేహితుడి దారుణ హత్య.. చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితులు
 రూ.65 లక్షల లావాదేవీల వివాదం.. స్నేహితుడి దారుణ హత్య.. చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితులు

డబ్బుల లావాదేవీల్లో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో వెలుగుచూసింది. స్నేహితుడినే ముందస్తు ప్రణాళికతో హత్య చేసి, మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి పరారైన ఇద్దరు నిందితులు, పోలీసులు తమ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారని తెలుసుకుని చివరకు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

షాద్‌నగర్ ఏసీపీ ఎస్. లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి గ్రామానికి చెందిన పానుగంటి అరవింద్, వీరకారి శివాజీ స్నేహితులు. 2021 నుంచి ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మంగనూరు గ్రామానికి చెందిన మహమ్మద్ హసన్ (36)తో కలిసి మొక్కజొన్న, వడ్ల వ్యాపారం చేసేందుకు "ఏఆర్ కాన్వాసింగ్" పేరుతో బిజినేపల్లిలో కార్యాలయం ఏర్పాటు చేసి వ్యాపారాన్ని ప్రారంభించారు.

వ్యాపార లావాదేవీల్లో భాగంగా హసన్ వద్ద నుంచి సుమారు రూ.65 లక్షలు రావాల్సి ఉండగా, రైతులకు చెల్లింపులు చేయాలంటూ అరవింద్, శివాజీలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో పలుమార్లు హసన్‌ను డబ్బుల కోసం నిలదీశారు. హైదరాబాద్‌లో తనకు రావాల్సిన డబ్బులు తీసుకొచ్చి చెల్లిస్తానని హసన్ చెప్పడంతో, డబ్బులు రాకపోతే అతడిని హత్య చేయాలని ఇద్దరూ ముందుగానే పథకం రచించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ నెల 22వ తేదీన ఉదయం హసన్‌ను తీసుకుని శివాజీ తన కారులో జడ్చర్ల సమీపంలోని పిస్తా హౌస్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి ముగ్గురూ కలిసి అరవింద్ కారులో హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే హసన్ చెప్పిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోవడంతో సాయంత్రం తిరుగు ప్రయాణంలో షాద్‌నగర్ సమీపంలోని ఓ వైన్స్‌లో బీరు కొనుగోలు చేసి, బూర్గుల గ్రామ శివారులోని ట్రూల్యాండ్ మార్క్-9 ఎక్స్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వెంచర్ వద్దకు వెళ్లారు.

అక్కడ మరోసారి డబ్బుల విషయమై వాగ్వాదం జరగగా, ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం శివాజీ హసన్‌ను గట్టిగా పట్టుకోగా, అరవింద్ బీరు సీసాతో అతని తలపై పలుమార్లు బలంగా కొట్టి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.

హత్య అనంతరం హసన్ మృతదేహాన్ని కారు డిక్కీలో ఉంచుకుని మంగనూరు వైపు బయలుదేరిన నిందితులు, మార్గమధ్యంలో హసన్ కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తున్నట్లు గుర్తించి అనుమానం రాకుండా ఉండేందుకు తిరిగి హత్య జరిగిన ప్రదేశానికే వచ్చారు. అక్కడ వేపచెట్టు కింద మృతదేహాన్ని పడేసి, పైన మొక్కలు కప్పి గుర్తుపట్టకుండా దాచిపెట్టారు. అనంతరం రక్తపు మరకలు ఉన్న బట్టలను గండిపేట సమీపంలో పడేసి, మరుసటి రోజు రైలులో తిరుపతికి వెళ్లారు. అక్కడి నుంచి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. పోలీసులు తమను త్వరలోనే పట్టుకుంటారని గ్రహించిన అరవింద్, శివాజీ మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో స్వచ్ఛందంగా షాద్‌నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది.

ఈ కేసు విచారణలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పర్యవేక్షణలో, షాద్‌నగర్ డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విచారణాధికారి కె. సీతారాం, ఎస్‌ఐలు ప్రణయ్, శివారెడ్డి, సిబ్బంది రవీందర్, జాకీర్, కరుణాకర్, రాజు, సంతోష్ తదితరులు సమన్వయంతో పనిచేసి నిందితులు లొంగిపోయేలా కీలక పాత్ర పోషించారని ఏసీపీ తెలిపారు.

Blogger ఆధారితం.