నేటి నుంచి తెలంగాణలో ఉచిత సన్నబియ్యం పంపిణీ ప్రారంభం
నేటి నుంచి తెలంగాణలో ఉచిత సన్నబియ్యం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్, జులై 1: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు జులై నెల ఉచిత సన్నబియ్యం పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలోని సుమారు 1.06 కోట్ల రేషన్ కార్డుల కుటుంబాలకు, దాదాపు 3.41 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పంపిణీ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
పౌరసరఫరాల శాఖ ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసి, జులై నెలకు అవసరమైన 2.15 లక్షల టన్నుల బియ్యాన్ని ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని చౌకధరల దుకాణాలకు చేరవేసింది. దీంతో నెల తొలి రోజు నుంచే లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమకు కేటాయించిన బియ్యాన్ని పొందే అవకాశం కల్పించారు.
గత యాసంగి ధాన్యం కొనుగోళ్ల కారణంగా ప్రభుత్వ గోదాముల్లో నిల్వ సామర్థ్యం సమస్య తలెత్తడంతో, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఏప్రిల్‌లోనే ఏప్రిల్, మే, జూన్ నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేశారు. కేంద్రం కేటాయించిన 6.43 లక్షల టన్నుల బియ్యంలో, రాష్ట్రం 95 శాతం (6.08 లక్షల టన్నులు) పంపిణీ చేసి రికార్డు నమోదు చేసింది.
రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Post a Comment