07 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 948.478 కిలోల గంజాయిని నిర్వీర్యం చేసిన జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగా, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న భారీ మొత్తంలో గంజాయిని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ పూర్తిగా నిర్వీర్యం చేసింది. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 07 కేసులకు సంబంధించిన మొత్తం 948.478 కిలోల గంజాయిని తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలోని ఎం/ఎస్ ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ లిమిటెడ్ ప్రాంగణంలో శాస్త్రీయ విధానంలో దహనం చేసి బూడిద చేసినట్లు జిల్లా ఎస్పీ, జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ రోహిత్ రాజు తెలిపారు.
ఎస్పీ వివరాల ప్రకారం, నిర్వీర్యం చేసిన గంజాయి విలువ సుమారు రూ.4.74 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియను పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ నిర్వహించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా తల్లిదండ్రుల ఆశలను కూడా ఆవిరి చేస్తోందన్నారు. చట్టవ్యతిరేకంగా మాదకద్రవ్యాల తయారీ, రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు లేదా అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ నిర్వీర్య కార్యక్రమంలో జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులు, కొత్తగూడెం సబ్‌డివిజన్ డీఎస్పీ ఆదినారాయణ, భద్రాచలం సబ్‌డివిజన్ డీఎస్పీ అరుణ్ కుమార్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment