బాలాజీ స్వీట్ హౌస్ సీజ్.. రూ.1 లక్ష జరిమానా.. ఫుడ్ సేఫ్టీ అధికారుల చర్య
బాలాజీ స్వీట్ హౌస్ సీజ్.. రూ.1 లక్ష జరిమానా.. ఫుడ్ సేఫ్టీ అధికారుల చర్య
సిరిసిల్ల: స్థానికంగా కలకలం రేపిన బాలాజీ స్వీట్ హౌస్ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు చేపట్టారు. తినుబండారంలో బల్లి పడిన ఘటనలో ఆ ఆహారం తిన్న కొందరు చిన్నారులు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటన నేపథ్యంలో జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ సిబ్బందితో కలిసి బాలాజీ స్వీట్ హౌస్‌పై తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం స్వీట్ హౌస్‌తో పాటు తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. అలాగే ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో సంస్థపై రూ.1 లక్ష జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.
తనిఖీల సందర్భంగా మీడియా ప్రతినిధులు, స్థానికులు అడిగిన ప్రశ్నలకు జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తనిఖీల్లో గుర్తించిన లోపాలపై అధికారులు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, సిరిసిల్ల పట్టణంలో అనేక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ షాపులు, టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు నిర్వహణలో ఉన్నప్పటికీ, ఇలాంటి ఘటన జరిగిన తర్వాత మాత్రమే అధికారులు స్పందించారని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వ్యాపారులపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే, సీజ్ చేసిన దుకాణానికి సాధారణంగా అమర్చే ప్రభుత్వ అధికారిక సీజ్ నోటీసు లేదా ముద్ర కనిపించలేదని స్థానికులు, మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై కూడా అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, ఆహార నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపే అవకాశముందని సమాచారం. పరీక్షల నివేదికల ఆధారంగా అవసరమైతే మరిన్ని చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Post a Comment