హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్

 

హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్

హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్

హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమ చేపల వ్యాపార ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. కుళ్లిపోయిన చేపలు, రొయ్యలను రసాయనాలతో శుభ్రపరచి తాజాగా ఉన్నట్లుగా చూపిస్తూ విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళహాట్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త దాడుల్లో ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తార ఫిషరీస్‌లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో సుమారు రూ.90 వేల విలువైన 100 కిలోల పాడైన రొయ్యలు, 162 కిలోల కుళ్లిపోయిన చేపలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చేపల నుంచి దుర్వాసన రాకుండా, అవి తాజాగా కనిపించేలా ఉపయోగిస్తున్న 10 కిలోల సోడియం బైకార్బోనేట్ పౌడర్ను కూడా సీజ్ చేశారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులు బేగంబజార్ ప్రాంతం నుంచి తక్కువ ధరకే పాడైన చేపలు, రొయ్యలను కొనుగోలు చేసి, వాటిని రసాయనాలతో శుభ్రపరచి తాజా చేపల్లా మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా ఈ చేపలను హోటళ్లు, శుభకార్యాలు, వివిధ ఈవెంట్లకు కూడా సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

జనావాసాల మధ్య అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో చేపలను నిల్వ ఉంచడం, ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్థాలను విక్రయించడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజలు చేపలు కొనుగోలు చేసే సమయంలో నాణ్యత, పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Blogger ఆధారితం.