తల్లిదండ్రుల సేవే దైవసేవ.. విద్యార్థులకు షేఖ్ అబ్దుల్ బాసిత్ సందేశం
మణుగూరు: అంతర్జాతీయ నాన్నల దినోత్సవం సందర్భంగా మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రుల పట్ల గౌరవం, ప్రేమ, విధేయత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
మనిషి ఈ లోకానికి రావడానికి మూలాధారమైన తల్లిదండ్రుల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో మెలగాలని ఆయన అన్నారు. తమ సంతానం భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ జీవితాన్నే త్యాగం చేస్తారని, వారి సేవలను ఎన్నటికీ మరవకూడదని సూచించారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని, వారి అవసరాలను ప్రేమతో తీర్చాలని విద్యార్థులకు సూచించారు. మానవాళికి మార్గదర్శకమైన పవిత్ర ఖురాన్‌లో తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని స్పష్టంగా ఆదేశించబడిందని ఆయన పేర్కొన్నారు.
ఖురాన్‌లో “మీ వద్ద మీ తల్లిదండ్రులలో ఒకరు గానీ, ఇద్దరు గానీ వృద్ధాప్యంలో ఉంటే వారిని ‘ఉఫ్’ అని కూడా అనకండి. వారితో కఠినంగా మాట్లాడకండి. ఓ ప్రభువా! బాల్యంలో వారు మాపై చూపిన ప్రేమ, కరుణలాగే వారిపై కూడా కరుణ చూపుమని ప్రార్థించండి” అని పేర్కొన్న విషయాన్ని ఆయన విద్యార్థులకు వివరించారు.
తండ్రి సంతోషంలోనే సృష్టికర్త అల్లాహ్ సంతోషం ఉంటుందని, తండ్రి అసంతృప్తిలోనే అల్లాహ్ అసంతృప్తి ఉంటుందని ప్రవక్త ముహమ్మద్ (స.అ) బోధించారని తెలిపారు. దేవుని అనుగ్రహం పొందాలంటే ముందుగా కన్నవారికి సేవ చేయాలని, వారి దీవెనల వల్లే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, విజయాలు సిద్ధిస్తాయని చెప్పారు.
భారతీయ సంస్కృతిలో కూడా తల్లిదండ్రుల పట్ల భక్తి, విధేయతకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొన్నారు. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు రాజ్యాన్ని త్యాగం చేసి 14 సంవత్సరాలు వనవాసం చేసిన శ్రీరాముడు ఆదర్శప్రాయుడని, అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో మోసుకుని తీర్థయాత్రలు చేయించిన శ్రావణ కుమారుడి సేవాభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
కేవలం ఒక రోజు నాన్నల దినోత్సవాన్ని జరుపుకోవడం కాకుండా, ప్రతిరోజూ తల్లిదండ్రులను సంతోషంగా ఉంచేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. అలా చేసినప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడంతో పాటు దైవకృపకు పాత్రులవుతారని చెప్పారు.
అలాగే తల్లిదండ్రులు మరణించిన తర్వాత కూడా వారి బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగించాలని, వారి పేరుతో పేదలు, అనాథలు, వృద్ధులకు సేవ చేయాలని సూచించారు. అలాంటి సేవల ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయులు శీరీషా, సల్మా, సరస్వతి, ప్రసన్న, విజయలక్ష్మి, లతీఫా, ఖాజా, నుసరత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment