శాంతి భద్రతల పరిరక్షణకు భద్రాచలంలో విస్తృత తనిఖీలు
శాంతి భద్రతల పరిరక్షణకు భద్రాచలంలో విస్తృత తనిఖీలు
అనుమానిత వ్యక్తులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డీఎస్పీ అరుణ్ కుమార్ ప్రత్యేక దృష్టి
భద్రాచలం, జూన్ 11: పట్టణంలో శాంతి భద్రతలను కాపాడడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో భద్రాచలం సబ్ డివిజనల్ డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు ముఖ్యంగా పట్టణంలోని లాడ్జిలు, బస్టాండ్ పరిసర ప్రాంతాలు మరియు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చేపట్టారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచుతూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు డీఎస్పీ అరుణ్ కుమార్ తెలిపారు. లాడ్జిలలో బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు పత్రాలను పరిశీలించి, లాడ్జి నిర్వాహకులు తప్పనిసరిగా అతిథుల పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు.
అదేవిధంగా బస్టాండ్ ప్రాంతంలో సంచరిస్తున్న అనుమానాస్పద వ్యక్తులను విచారించి, వారి గుర్తింపు వివరాలను సేకరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే ఏ విధమైన కార్యకలాపాలను సహించబోమని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజల సహకారంతోనే శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో భద్రాచలం పట్టణ పోలీస్ సిబ్బంది, ప్రత్యేక బృందాలు పాల్గొని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో నేర నియంత్రణ, ప్రజల భద్రత కోసం ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసు అధికారులు వెల్లడించారు.

Post a Comment