ఒంగోలులో విషాదం.. ఈత సరదా నలుగురు చిన్నారుల ప్రాణాలు బలిగొన్న ఘటన

ఒంగోలులో విషాదం.. ఈత సరదా నలుగురు చిన్నారుల ప్రాణాలు బలిగొన్న ఘటన

ఒంగోలులో విషాదం.. ఈత సరదా నలుగురు చిన్నారుల ప్రాణాలు బలిగొన్న ఘటన

ఒంగోలు, జూన్ 4: ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిధిలోని చెరువుకొమ్ముపాలెంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లిన నలుగురు చిన్నారులు నీటి కుంటలో మునిగి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్థానికుల వివరాల ప్రకారం, చెరువుకొమ్ముపాలెం సమీపంలోని నీటి కుంటలో స్నానానికి దిగిన కరేటి అభిరామ్ (14), కరేటి సుశాంత్ (12), పొదిలి చిన్ను (11), ఇల్లా దినేష్ (10) ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి వెళ్లి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది, గజ ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పలుగంటల శ్రమ అనంతరం నలుగురు చిన్నారుల మృతదేహాలను నీటి కుంట నుంచి వెలికితీశారు.

మృతుల్లో అభిరామ్, సుశాంత్‌లు సొంత అన్నదమ్ములు కావడం మరింత విషాదాన్ని మిగిల్చింది. తొలుత అభిరామ్, సుశాంత్, దినేష్ మృతదేహాలు లభించగా, అనంతరం చిన్ను మృతదేహాన్ని కూడా గుర్తించి వెలికితీశారు.

చిన్నారుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కొద్దిసేపటి క్రితం వరకు కళ్లముందే ఆడుకుంటూ కనిపించిన పిల్లలు ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామస్తులు కూడా ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఇదిలా ఉండగా, ఈ విషాద ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డీఎస్‌బీవీ స్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. వేసవి కాలంలో చెరువులు, కుంటలు, నదుల్లో ఈతకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు.

Blogger ఆధారితం.