వివాహేతర సంబంధం.. భర్త హత్య కేసులో సంచలన తీర్పు! భార్యకు, ప్రియుడికి జీవిత ఖైదు
వివాహేతర సంబంధం.. భర్త హత్య కేసులో సంచలన తీర్పు! భార్యకు, ప్రియుడికి జీవిత ఖైదు
నెల్లూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన కేసులో గూడూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేరం రుజువుకావడంతో హతుడి భార్య మానస, ఆమె ప్రియుడు ఎంట్రపాటి రవివర్మకు జీవిత ఖైదు విధిస్తూ సోమవారం ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి కె. వెంకటనాగ పవన్ తీర్పు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరులోని నరసయ్యగుంట ప్రాంతానికి చెందిన రూపేష్, మానస దంపతులు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అనంతరం మానసకు గూడూరు మండలం కొండగుంట గ్రామానికి చెందిన ఎంట్రపాటి రవివర్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయం తెలుసుకున్న రూపేష్ ఒక సందర్భంలో రవివర్మపై దాడి చేయడంతో, అతడిని హత్య చేయాలని మానస, రవివర్మ పథకం రచించారు. 2021లో మానస అత్తగారి ఇంటికి వెళ్లిన సమయంలో రవివర్మ రూపేష్ ఇంటికి చేరుకుని నిద్రలో ఉన్న అతని తలపై ఇనుప రాడ్‌తో దాడి చేసి హత్య చేశాడు.
మరుసటి రోజు ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
విచారణలో నేరం రుజువుకావడంతో గూడూరు ఏడో అదనపు జిల్లా జడ్జి రవివర్మ, మానసలకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.50 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.

Post a Comment