చేతులెట్లా వచ్చాయిరా..! పసిపిల్లలపై పాశవికం.. చేతులు, కాళ్లు కట్టి వేడి గరిటెతో చిత్రహింసలు

 

చేతులెట్లా వచ్చాయిరా..! పసిపిల్లలపై పాశవికం.. చేతులు, కాళ్లు కట్టి వేడి గరిటెతో చిత్రహింసలు

చేతులెట్లా వచ్చాయిరా..! పసిపిల్లలపై పాశవికం.. చేతులు, కాళ్లు కట్టి వేడి గరిటెతో చిత్రహింసలు

సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్: మానవత్వాన్ని మంటగలిపే ఘటన హుజూర్‌నగర్‌లో వెలుగుచూసింది. ఇద్దరు అమాయక చిన్నారులను వారి తల్లి, సవతి తండ్రి తీవ్రంగా హింసించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఖమ్మం జిల్లాకు చెందిన ఇందూ అనే మహిళకు వెంకటేష్‌తో వివాహం కాగా, వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అనంతరం అనారోగ్యంతో వెంకటేష్ మృతి చెందడంతో, ఇందూకు హుజూర్‌నగర్‌కు చెందిన నకరికంటి రవితో పరిచయం ఏర్పడి రెండో వివాహం జరిగింది. అప్పటి నుంచి మొదటి భర్తకు జన్మించిన ఇద్దరు చిన్నారులతో కలిసి వారు హుజూర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.

స్థానికుల కథనం ప్రకారం, సవతి తండ్రి రవికి ఆ చిన్నారులంటే ఇష్టం లేక తరచూ వారిపై కోపం చూపించేవాడు. అతని ప్రవర్తనకు ప్రభావితమైన తల్లి కూడా సొంత పిల్లలనే వేధించేదని ఆరోపిస్తున్నారు. చిన్నారుల చేతులు, కాళ్లు కట్టి వేడి ఇనుప గరిటెతో శరీరంపై కాల్చడం వంటి అమానుష హింసలకు పాల్పడినట్లు వెల్లడైంది.

చిన్నారుల ఏడుపులు, ఆర్తనాదాలు తరచూ వినిపించడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా, పిల్లలు తీవ్ర గాయాలతో కనిపించారు. వెంటనే వారిని రక్షించి హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

పోలీసులు తల్లిదండ్రులను విచారించి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. ప్రస్తుతం చిన్నారులను స్థానికుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, ఇకపై పిల్లలపై హింస కొనసాగితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా వారిని బాలల సంరక్షణ వ్యవస్థ ఆధ్వర్యంలో ఉంచే చర్యలు కూడా తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Blogger ఆధారితం.