రెండు వేల మంది కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుంది: కల్వకుంట్ల కవిత
రెండు వేల మంది కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుంది: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు రెండు వేల మంది సింగరేణి కార్మికుల వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తామని ఆ సంస్థ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ప్రభుత్వం మొక్కుబడిగా మెడికల్ బోర్డులు నిర్వహించే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆమె స్పష్టం చేశారు.
మెడికల్ బోర్డు నిర్వహించకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని తెలంగాణ రక్షణ సేన హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం రెండు రోజుల పాటు నామమాత్రంగా మెడికల్ బోర్డు నిర్వహించిందని కవిత విమర్శించారు. రెండు వేల మంది కార్మికులు ఎదురుచూస్తుండగా కేవలం 120 మంది పేర్లను మాత్రమే ప్రకటించారని, అందులో కూడా 28 మంది కార్మికులకు తమను మెడికల్ బోర్డుకు పిలిచిన విషయమే తెలియదని ఆరోపించారు.
మెడికల్ బోర్డుకు హాజరైన వారిలో కేవలం 20 శాతం మందినే అన్‌ఫిట్‌గా ప్రకటించారని పేర్కొన్న ఆమె, గతంలో అమలు చేసిన విధంగానే మెడికల్ అన్‌ఫిట్ ప్రక్రియను నిరంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
సింగరేణిని కాపాడాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, కార్మికులకు భరోసా కల్పించే చర్యలు కనిపించడం లేదని ఆమె విమర్శించారు. కాంట్రాక్టర్ల నుంచి వచ్చే కమిషన్ల కోసమే ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. ప్రతినెలా కనీసం రెండు సార్లు మెడికల్ బోర్డులు నిర్వహించేలా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
హెచ్‌ఎంఎస్ నాయకులు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపునిచ్చిన కవిత, సింగరేణి కార్మికులకు తెలంగాణ రక్షణ సేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Post a Comment