పేద ఎస్సీలకు భూమి పంపిణీ చేయాలని సీఎంను కోరిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు బొమ్మెర శ్రీనివాస్ కృతజ్ఞతలు
పేద ఎస్సీలకు భూమి పంపిణీ చేయాలని సీఎంను కోరిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు బొమ్మెర శ్రీనివాస్ కృతజ్ఞతలు
కొత్తగూడెం, జూలై 19: పేద, భూమిలేని షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు సాగుభూమి పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన ఎస్సీ సామాజిక వర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలకు షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆదివారం కొత్తగూడెం సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమిలేని నిరుపేద ఎస్సీలకు భూమి పంపిణీ చేయడంతో పాటు మొత్తం 14 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీలు, ఎమ్మెల్యేల చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న అనేక మంది ఎస్సీ కుటుంబాలకు ఇప్పటికీ ఇంటి స్థలం, సాగుభూమి లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. అలాంటి కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా ల్యాండ్ క్యాప్ భూములను పరిరక్షించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పెంచాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే రుణాలను విస్తరించాలని, ఎస్సీ బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
చేవెళ్ల డిక్లరేషన్‌లో ఎస్సీ నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని కూడా ప్రభుత్వం అమలు చేయాలని బొమ్మెర శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో జేఏసీ గౌరవ సలహాదారు సెనగ వెంకటేశ్వర్లు, ప్రభాకర్, గడ్డం రాగన్ బాబు, ఎనగంటి శ్రీను, అబ్బా రాజయ్య, పుల్లారావు, సలిగంటి కొమరయ్య, కొప్పుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment