సదాశివపేట సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సదాశివపేట సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు


 సదాశివపేట సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సదాశివపేట: ఎందరో త్యాగధనుల పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. తాజోద్దీన్ అన్నారు. సదాశివపేటలో శనివారం సీపీఐ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎం. తాజోద్దీన్ జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు, త్యాగధనులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని తెలిపారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు.

స్వాతంత్ర్య ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలని, భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందరికీ సమానంగా లభించాలని ఆకాంక్షించారు. దేశంలో అపారమైన ఖనిజ సంపద ఉందని, దానిని సద్వినియోగం చేసుకుని దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.

అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని తాజోద్దీన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లో ఉన్న చట్టాల్లో మార్పులు చేసేందుకు ప్రయత్నించడం సరైన విధానం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరి హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు. హక్కులు కొందరికే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా వర్తించేలా పాలన సాగాలని అన్నారు.

స్వాతంత్ర్యం సిద్ధించి 80 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ దేశంలోని కింది స్థాయి ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.డి. షఫీ, ఏఐటీయూసీ మండల కార్యదర్శి సీహెచ్. శంకరప్ప, ముంగి రమేష్, ముస్తఫా, సాదిక్ అలీ, వెంకట్, యూసుఫ్, యాకూబ్ అలీ, టి. బుజమ్మ, గంగమ్మ, పూలమ్మ, సత్యమ్మ, బిపాషాబీ, యాదమ్మ, మంజుల, తస్లిమ్, దేవి తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.